అనకాపల్లి, జనవరి 31: అనకాపల్లి గవరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం మరియు ఏకరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్. తెలిపారు.
శనివారం ఆయన అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి, ఎస్.బి డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్ మరియు ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు అధికారులకు మరియు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
అమ్మవారి రథయాత్ర సాగే పురవీధులను ఎస్పీ గారు స్వయంగా పరిశీలించారు. రథం కదిలే సమయంలో జనసందోహాన్ని నియంత్రించేందుకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టేజ్ ప్రోగ్రాములు, జానపద కళాకారుల ప్రదర్శనలు మరియు నేలవేషాల వద్ద రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
రింగ్ రోడ్డు సెంటర్ వద్ద భారీ బాణాసంచా ప్రదర్శన సమయంలో అగ్నిప్రమాదాలు జరగకుండా, ప్రజలు సురక్షిత దూరంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉత్సవాల వేళ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని, పార్కింగ్ స్థలాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ స్థాయిలో జరిగే ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ కోరారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు బాల సూర్యారావు, ప్రేమ్ కుమార్, వెంకట నారాయణ ఇతర అధికారులు, కమిటీ సభ్యులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.