“రక్తదానం మహాదానం”… మోదకొండమ్మ జాతరలో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్
మూడు రోజులపాటు భారీ రక్తదాన శిబిరం నిర్వహణ
ప్రాణాలను కాపాడే పవిత్ర సేవలో యువత ముందుకు రావాలి : జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ
దివ్య దర్శిని న్యూస్,పాడేరు, మే 15
శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో మానవతా సందేశాన్ని విస్తృతంగా చాటేలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ తిరుమాని శ్రీ పూజ తెలిపారు.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో, ఈ నెల 17, 18, 19 తేదీలలో జరుగనున్న శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర సందర్భంగా “రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి” అనే నినాదంతో ప్రత్యేక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జాతర వేళ వేలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే రక్త నిల్వలను సమకూర్చేందుకు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మానవ జీవితాలను రక్షించడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను నిలబెట్టగలదని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ మూడు రోజులపాటు నిర్వహించే మెగా శిబిరంలో జిల్లా రెవెన్యూ శాఖ, సచివాలయ సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యువతీ యువకులు, జాతరకు వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జాతరకు వచ్చే ప్రతి భక్తుడు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, తమతో పాటు మరికొందరు యువతను కూడా ప్రోత్సహించాలని సూచించారు. రక్తదానం ద్వారా సమాజానికి సేవ చేయడంతో పాటు, మానవత్వాన్ని చాటే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జిల్లా అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు “రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్‌షిప్ డ్రైవ్”లో పాల్గొని సంస్థ సేవా కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ జి. గౌరీ శంకర్రావు, కోశాధికారి పి. సూర్యారావు, జిల్లా కోఆర్డినేటర్ ఎస్. పూర్ణానంద, ఎంసీ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.