స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు
విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సేవాభావం అలవరుచుకోవాలని ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శుక్రవారం ఉదయం గోపాలపట్నంలోని బాలాజీ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంపును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో స్కౌట్స్ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం, సామాజిక బాధ్యతను ఇవి నేర్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. బాలాజీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, స్కౌట్ మాస్టర్లు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.