రామతీర్థం రామస్వామి దేవస్థానం మాడ వీధులకు మోక్షం
* గత కొన్ని ఏళ్లగా పాతుకుపోయిన మాడవీధి ఆక్రమణలకు స్వస్తి
*ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆదేశాలతో దేవాలయం చుట్టూ ఆక్రమణలు తొలగింపు పై
* భక్తులు హర్షాధిరేకాలు వ్యక్తం
నెల్లిమర్ల, దివ్యదర్శిని న్యూస్:
రాష్ట్రంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానం. దీనినే ఉత్తరాంధ్ర భద్రాద్రిగా కూడా కొనియాడుతూ ఉంటారు. ఈ దేవాలయంలో ఏడాది పొడువునా స్వామివారికి నిర్వహించే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆలయ మాడ వీధులు చాలా ఇరుగ్గా మూసుకుపోయి ఉండడంతో శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో అధిక సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఇబ్బంది పడే వారు. అంతేకాకుండా శ్రీరామనవమి వేడుకలలో స్వామివారి కల్యాణానికి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు కార్యక్రమంలో కూడా స్వామి వారిని ఊరేగించే మూడు వాహనాల సేవకు చాలా ఇబ్బంది పడే సందర్భాలు ఏర్పడేవి. పరిసర ప్రాంత స్థానికులు ఆలయం చుట్టూ ఆక్రమణలు చేసుకుని షాపులు ఏర్పాటు చేయడం వల్ల ఉత్సవాల సమయాలలో ముఖ్యంగా మహిళలు బాలింతలు వృద్ధులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. భక్తుల దర్శినానికి, ఉత్సవ విగ్రహాల ఊరేగింపునకు దీర్ఘకాలికంగా ఏర్పడుతున్న ఈ ఇబ్బందులను తొలగించి దేవాలయాన్ని దేవాలయ అభివృద్ధికై, స్వామి వారిపై భక్తులకున్న విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సదుద్దేశంతో ఆక్రమణలు తొలగింపు పై అనేక ఒత్తిడి ఉన్నప్పటికీ ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ దామోదర్ చొరవతో ఎట్టకేలకు ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణ షాపులను తొలగించడంతో భక్తులు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చొరవ పై హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఈఓపీఆర్డీ శంకర్ జగన్నాథం, ఎస్ఐ బి గణేష్ రెండు రోజులు నుంచి ఆలయం చుట్టూ ఉన్న షాపులను జెసిపి సాయంతో తొలగించారు. ఇటీవల శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, ఆర్ డబ్ల్యూఎస్, పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సమీక్షా సమావేశం నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టూ ఉన్న షాపులపై సిఐ జి రామకృష్ణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మాడ వీధులలో షాపులు ఏర్పాటు వల్ల స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు అసౌకర్యం కలగడంతో పాటు, ఉత్సవాల సమయంలో విగ్రహాల ఊరేగింపునకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని సిఐ చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ ఒత్తుడులకు లొంగకుండా అధికారులు ఆక్రమణలు తొలగించారు. దీంతో రామతీర్థం రామస్వామి దేవస్థానం మాడ వీధులకు మోక్షం లభించింది. ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించడంతో భక్తులు హర్షాధిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.