పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం
యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి
*రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై రెండ్రోజుల్లో విధాన ప్రకటన
అమరావతి : పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని, దీని వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రియాలిటి. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుంది. దీనిని ప్రోత్సహించాలి. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయి. దేశం మొత్తం దుబారాను తగ్గించాలి. పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లటం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్‌గా మారింది. కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించి ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా నిలవాలి. సెక్యూరిటీని కూడా కుదించుకోవాలి. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలన్న ప్రధాని సూచనలను పాటిద్దాం. బంగారం కొనడాన్ని కూడా తగ్గించాలని ప్రధాని చెప్పారు. దీనిపైనా ప్రజలు ఆలోచన చేయాలి. మన దేశంలో, రాష్ట్రంలోనూ మంచి పర్యాటక ప్రాంతాలున్నాయి. ప్రజలు విదేశాలకు వెళ్లడం కంటే స్వదేశంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలి. సెలవు వస్తే విదేశాలకు వెళ్తున్నారు. అంతకంటే మంచి ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో అరకు, పాపికొండలు, గండికోట వంటి ప్రదేశాలు ఉన్నాయి. గోవాను మించిన టూరిజం కేంద్రంగా సూర్యలంక మారుతుంది. నాదేశం-నా బాధ్యత అనే ఆలోచన ప్రజలంతా చేయాలి’. అని సీఎం సూచించారు.