పట్టణమంతా గృహ సిలిండర్ల అక్రమ వాడకమే
శృంగవరపు కోట దివ్యదర్శని
సామాజిక కార్యకర్త, న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ స్వఛ్ఛందంగా పట్టణంలో పందిరప్పన్న కూడలి నుండి కొత్తూరు వరకూ అరకు, విశాఖ రహదారిలో హోటళ్ళు, చికెన్ సెంటర్లను సందర్శించగా అన్నిచోట్లా అక్రమంగా గృహ వినియోగ సిలిండర్లనే వినియోగిస్తున్నట్లు తెలిసింది. అన్నిచోట్లా ప్లాస్టిక్, గోనె సంచులను తొడిగి ఉంచడముతో అందరికీ గ్యాస్ భద్రతా నియమాలపై అవగాహన కల్పించి వాటిని తొలగింపజేసారు. గృహావసారాల వంట గ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు వాడడం ఎస్మా చట్టరీత్యా నేరమని వాణిజ్య సిలిండర్లనే వాడాలని హితవు చెప్పారు. ప్రజా భద్రత పట్ల అవగాహన కల్పిస్తూ, గ్యాస్ కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదని అన్నారు. రెండు నెలలుగా వాణిజ్య వినియోగసిలిండర్ల కొరకు ప్రయత్నిస్తున్నా భారత్ గ్యాస్ సరఫరా చేస్తున్న శ్రీ లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ వారు వాణిజ్య సిలిండర్లను తమకు యివ్వడం లేదని, స్టాక్ లేదని చెబుతున్నారని ఇద్దరు వ్యాపారులు వాపోయారు. వాణిజ్య సిలిండర్లు సరఫరా సక్రమంగా లేదని, లారీల్లో పెద్ద హోటళ్ళకే వాటిని సరఫరా చేస్తున్నారని, బ్లాక్ న వాటిని ఏజెన్సీలు అమ్ముకుంటున్నారని కొందరు చెప్పారు. తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు కళ్ళు మూసుకుంటే వంటగ్యాస్ కొరత నియంత్రణకు సామాన్య ప్రజలే స్వచ్ఛందంగా తనిఖీలు చేపట్టి ఫిర్యాదులు ప్రభుత్వాధికారులకు యివ్వవలసివస్తుందని, అందువలన సామాన్య ప్రజలు, వ్యాపారుల మధ్య మరింత వివాదాలు తలెత్తే అవకాశముందన్నారు. అక్రమంగా, బ్లాక్ లో గుట్టుచప్పుడు కాకుండా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య దుకాణాలకు సరఫరా చేస్తున్న గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులను రద్దుచేయాలన్నారు. తనిఖీలు చేపట్టని పౌర సరఫరా అధికారులను కూడా వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.