బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది

Bureau May 08, 2026 05:13 AM 5 views
పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది

పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది

భూ హక్కులు ఇవ్వకపోతే ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సిపిఎం పిలుపు

సాయినగర్, సింహాచలం, అడవివరం ప్రాంతాల్లో ఉధృతంగా సాగిన పాదయాత్ర

సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం ఇంకా కాలయాపన చేస్తే ప్రజల ఆగ్రహం ఉప్పెనలా పేలిపోతుందని సిపిఎం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. భూ హక్కుల సాధన కోసం కొనసాగుతున్న పాదయాత్ర ఐదో రోజు గురువారం సాయినగర్, సింహాచలం, అడవివరం ప్రాంతాల్లో ఉధృతంగా సాగింది. కాలనీల్లోకి అడుగుపెట్టిన సిపిఎం నాయకత్వానికి మహిళలు, యువత, కార్మికులు, వృద్ధులు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. “ఇక మోసాలు వద్దు — జి.ఓ ఇవ్వాలి”, “మా భూమి మాకు కావాలి”, “పేదలపై దాడులు ఆపు” అంటూ ప్రజలు నినాదాలతో ప్రాంతాలను మారుమోగించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సిపిఎం నాయకులు పంచగ్రామాల ప్రజలతో గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు రాజకీయంగా ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. వేలాది కుటుంబాలు భూ హక్కుల్లేక అవమానాలు, అనిశ్చితి, భయాందోళనల మధ్య జీవిస్తున్నా పాలకులకు కనీస మానవత్వం లేదన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ఎన్నికలు ముగిశాక ప్రజలను మర్చిపోవడం ప్రభుత్వాలకు అలవాటైందని ధ్వజమెత్తారు. “ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు? ఇంకెన్ని తరాలు బాధపడాలి?” అని ప్రశ్నించారు.

ముఖ్యవక్తలుగా పాల్గొన్న 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కేఎస్‌వి కుమార్ మాట్లాడుతూ 1996-97లో ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేకుండానే వేల ఎకరాలను సింహాచలం దేవస్థానం పేరుతో నమోదు చేసి సమస్య సృష్టించింది అప్పటి టిడిపి ప్రభుత్వమేనన్నారు. అనంతరం జి.ఓ నెం.578 ద్వారా దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలనే ఆక్రమణదారులుగా ముద్రవేసి వారి జీవితాలను అస్తవ్యస్తం చేశారన్నారు. ఇళ్లకు కరెంటు ఇచ్చింది ప్రభుత్వమే, పన్నులు వసూలు చేసింది ప్రభుత్వమే, ఓటర్లుగా గుర్తించింది ప్రభుత్వమే; ఇప్పుడు అదే ప్రభుత్వం ప్రజలను అక్రమదారులంటూ వేధించడం దారుణమైన అన్యాయమని మండిపడ్డారు.

2017 స్టేటస్ కో పేరుతో పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలు, మరమ్మతులు నిలిపివేసి ప్రజలను తమ ఇళ్లలోనే బందీలుగా మార్చారని విమర్శించారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు భూములు కేటాయించడంలో మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండవని, ధనికులకు ఒక న్యాయం — పేదలకు మరో న్యాయం అమలు చేస్తున్నారని ఆరోపించారు. 1903 గిల్మన్ సర్వే రికార్డుల ప్రకారం సింహాచలం దేవస్థానానికి కేవలం 39.5 ఎకరాలే ఉన్నాయని, మరి వేల ఎకరాలపై దేవస్థానం హక్కు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇకపై హామీలు, కమిటీలు, మాటలు ప్రజలు నమ్మబోరని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలను వెంటనే రద్దు చేయాలని, పంచగ్రామాల ప్రజలను పూర్తి హక్కుదారులుగా గుర్తిస్తూ స్పష్టమైన జి.ఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు, నిర్మాణాలు, మరమ్మతులపై ఉన్న అన్ని ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జివిఎంసీ, కలెక్టరేట్, దేవస్థానం కార్యాలయాల ముట్టడితో పాటు వేలాదిమందితో భారీ ప్రజా తిరుగుబాటు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

“ఇప్పుడు మౌనం కాదు — ఉద్యమమే మార్గం”, “జనం గర్జనతో జి.ఓ సాధిద్దాం” అంటూ పాదయాత్రలో ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పంచగ్రామాల ప్రజల ఐక్య పోరాటం ముందు ప్రభుత్వం తలవంచక తప్పదని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. భూ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించే వరకు పోరాటం ఆగదని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి జగన్, జోన్ నాయకులు బి వెంకటరావు పి అనసూయ, కె అప్పలనాయుడు ప్రభుదేవా సీనియర్ నాయకులు పి వెంకటరెడ్డి, శాస్త్రి, ప్రతినిధులు, కాలనీ నాయకులు, మహిళలు, యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```