క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి.
అరకు ఫెస్ట్ కు మరింత వన్నె తెచ్చిన అరకు మారథాన్
జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
(అరకులోయ దివ్య దర్శిని న్యూస్) క్రీడల్లో రాణించడం వల్ల అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు, ఖ్యాతి లభిస్తుందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. అరకు చలి ఉత్సవ్ సందర్భంగా రవ్వలగూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుండి అంజోడ, అరుకు పైనరీ వరకు 5 కిలోమీటర్ల మేర నిర్వహించిన అరకు మారథాన్ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా, శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో క్రీడల పరంగా ప్రతిభకు కొదవలేదని, క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి ప్రపంచంలో మంచి పేరు తెచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఉండే వ్యక్తుల శరీర సౌష్టవం, శక్తి భగవంతుడు ఇచ్చిన వరం అని వాటిని క్రీడల్లో ఉపయోగించుకోవాలన్నారు. సంకల్ప బలం ద్వారా ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ పోటీలలో రాణించే సత్తా ఉన్న క్రీడాకారులు మన ప్రాంతంలో ఉన్నారని, అరకు లాంటి మారథాన్ నులు ఉపయోగించుకొని మరింతగా మెరుగుపడాలన్నారు. ఈరోజు నిర్వహించిన మారథాన్లో 05 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ, 500 మంది క్రీడా కారులు పాల్గొని విజయవంతం చేయడం అరకు ఫెస్ట్ కి మరింత ఉత్సాహాన్ని, అందాన్ని తీసుకువచ్చింది అన్నారు. ఒక దేశం ఆర్థికంగా పరిపుష్టంగా లేకపోయిననూ, మిలటరీ పరంగా శక్తిమంతం కాకపోయినాను, క్రీడల ద్వారా మాత్రం ఆ దేశం యొక్క పేరు, గౌరవం, ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని అందుకు ఉదాహరణ జమైకా దేశం అన్నారు. భారతదేశ ప్రపంచ సంపన్న దేశాలలో మొదటి ఐదు స్థానాల్లో ఉందని అది మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. భారతదేశం లేకుండా అంతర్జాతీయ వ్యవహారాలు లేవని, ప్రపంచ రాజకీయాలను శాసిస్తుందని, ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని, శాంతి స్థాపనకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. అదే విధముగా రాబోయే ఒలింపిక్స్ లో మనము కూడా కష్టపడి గోల్డ్ మెడల్స్ సాధించి మొదటి మూడు స్థానాల్లో గర్వంగా నిలబడే విధంగా క్రీడా పరంగా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రాంతంలో చురుకుదనం, వేగం, చైతన్యం కలిగిన ఆణిముత్యాలు ఉన్నారని వారిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రతిభ ఉన్న స్థానిక క్రీడాకారులను గుర్తించి పోటీలలో రాణించే విధంగా ప్రోత్సహించాలన్నారు. రాజకీయాల గురించి, చట్టాల గురించి మాట్లాడే దానికంటే క్రీడల గురించి ఎక్కువగా మాట్లాడే రోజులు రావాలన్నారు. స్థానిక కోచ్ సింహాద్రి లాంటి వారు చాలా మంది ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతిభ ఉన్న క్రీడా కారులకు శిక్షణ మెరికల్లా తయారు చేయాలన్నారు. దాని ద్వారా క్రీడలపరంగా అరకు ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు యోగాంధ్ర గురించి ఏ వేదిక మీద నైనా, దావోస్ వెళ్లినా మాట్లాడేటప్పుడు అరకు యోగ ప్రస్తావన లేకుండా ఉండదని, అది మన అరకు కు యోగ పరంగా లభించిన గుర్తింపు అన్నారు. నిర్విరామంగా విద్యార్థులచే 108 సూర్య నమస్కారాలు చేయించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగిందని, ఈ సందర్భంగా యోగాంధ్రలో అరుకు పేరు మార్మోగిందన్నారు. జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ మాట్లాడుతూ యువత క్రీడల వైపు ఆసక్తి కనబరచడం వల్ల దురాలవాట్లకు దూరంగా ఉండవచ్చునని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండి వారు ఎంచుకున్న ఏ రంగంలోనైనా మెరుగ్గా రాణించగలుగుతారన్నారు. శక్తివంతమైన శరీర నిర్మాణం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అరకు మారథాన్ ఛాంపియన్స్ ను ప్రథమ బహుమతి వి రమేష్ గన్నెల గ్రామం 15,000/-, రెండవ బహుమతి విశాల్ అభిషేక్ 10,000/-, మూడవ బహుమతి వి అప్పలస్వామి 5,000/-, నాలుగవ స్థానములో నిలిచిన జి అడ్డ, వి మోహన్ రావు గన్నెల గ్రామం సంయుక్తముగా , ఐదవ బహుమతి వి శ్యామ్యూల్ మజ్జివలస గ్రామంకి అవార్డులు, జ్ఞాపికలు అందజేశారు. మారథాన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, స్థానిక గ్రామ సర్పంచ్ దాసు బాబు, డి.ఎస్.పి అభిషేక్, ఇన్చార్జ్ ఆర్డిఓ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి, డి ఎస్ టి ఓ, ఫారెస్ట్ రేంజ్ అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.