ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామిక వేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదిక అని సీఎం అన్నారు. ఏపీనీ బ్రాండ్ చేయడానికి, కొత్త పాలసీలపై మార్కెట్‌లో అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. 2025 దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చంద్రబాబు చెప్పారు.
మూడు రోజులు వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఏఐ, అగ్రికల్చర్, టూరిజం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలు వివరించామన్నారు. గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. యువశక్తి, సమర్థ నాయకత్వం, పాలసీల కారణంగా నేడు ప్రతీ రంగంలో భారత్‌లో కంపెనీల స్థాపనకు అవకాశాలు పెరుగుతున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను టాటా సన్స్ చైర్మన్ పంచుకున్నారు. విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్, అమరావతి క్వాంటం వ్యాలీ, కర్నూలులో తలపెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణపై టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేకంగా అధికారులను పంపి దీనిపై చర్చిద్దామని చంద్రశేఖరన్ చెప్పారు. రాష్ట్రంలో టాటా గ్రూపు చేపట్టిన టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో 3 స్పోర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని, ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు.